: నరేంద్ర మోదీ నిర్ణయంతో రూ. 26 వేల కోట్ల ఎగుమతులకు బ్రేక్... లక్షల మందికి ఉపాధి కరవు!: అబ్దుల్ ఫాహీమ్ ఖురేషీ


పశువధపై నిషేధాన్ని విధిస్తూ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తీసుకున్న నిర్ణయంతో సాలీనా రూ. 26 వేల కోట్ల (సుమారు 4 బిలియన్ డాలర్లు) విలువైన ఎగుమతులకు బ్రేక్ పడిందని, లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లయిందని పరిశ్రమ నిపుణులు వ్యాఖ్యానించారు. దేశీయ మాంసం పరిశ్రమలో లక్షల మంది ముస్లింలు ఉపాధిని పొందుతుండగా, ఇతర మతస్తులు పశువులను వ్యవసాయం, పాడి పరిశ్రమకు వాడుతున్న వారిలో అధికులుగా ఉండగా, వాటి వధపై నిషేధంతో ముస్లింలకు జీవనోపాధి దూరమైందని ముస్లిం ఆల్ ఇండియా జమియాతుల్ ఖురేష్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ ఫాహీమ్ ఖురేషీ వ్యాఖ్యానించారు.

దేశంలోని 130 కోట్ల మంది ప్రజల్లోని 14 శాతం ముస్లింలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపడంతో పాటు మత కల్లోలాలకూ కారణం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత ముస్లింలలో నెలకొన్న ఆందోళన, ఈ నిర్ణయంతో మరింతగా పెరిగిందని ఆయన అన్నారు. ఇండియాలో గోవులతో పోలిస్తే, గేదెల నుంచి తీసిన మాంసం వ్యాపారమే అధికమని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే తన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, 2016-17లో ఇండియా 13.3 లక్షల టన్నుల గేదె మాంసాన్ని ఎగుమతి చేసింది. దీని విలువ 3.9 బిలియన్ డాలర్లు. అంతకుముందు సంవత్సరం 13.1 లక్షల టన్నుల మాంసం ఎగుమతులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News