: మహిళా అధికారిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్ అధికారి


ఓ స్విమ్మింగ్ పూల్ లో పడి ప్రాణాలతో పోరాడుతున్న మహిళా అధికారిని రక్షించబోయిన యువ ఐఏఎస్ అధికారి తన ప్రాణాలను కోల్పోయిన విషాద ఘటన ఇది. దక్షిణ ఢిల్లీ పరిధిలోని వసంత్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హర్యానాలోని సోనీపట్ ప్రాంతానికి చెందిన ఆశిష్ దహియా (30), జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాడర్ అధికారిగా ప్రస్తుతం ఫారిన్ సర్వీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బెర్ సరాయ్ ప్రాంతంలోని ఫారిన్ క్లబ్ ఇనిస్టిట్యూట్ లో గత రాత్రి జరిగిన ఓ పార్టీకి ఆయన వెళ్లారు.

పార్టీ తరువాత అందరూ కలసి ఈత కొట్టాలని భావించారు. ఆ సమయంలో వీరంతా పూటుగా మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తోంది. పొరపాటున కాలు జారి ఓ మహిళా అధికారి స్విమ్మింగ్ పూల్ లో పడగా, ఆమెను రక్షించేందుకు ఆశిష్ నీటిలోకి దూకాడు. ఆపై మహిళా అధికారి క్షేమంగా బయటకు రాగా, ఆశిష్ మాత్రం కనిపించలేదు. ఆపై కొద్ది క్షణాలకే అతను నీటిపై తేలుతూ కనిపించగా, బయటకు లాగి, ప్రాథమిక చికిత్స చేయించారు. అతని గుండె తిరిగి కొట్టుకునేలా చేసేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, రాత్రి 12:50 గంటల సమయంలో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసును విచారిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News