: బీఫ్ ను బ్యాన్ చేసి... బార్ ను ఓపెన్ చేసిన యూపీ మంత్రి...సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు
ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్ చేసిన పని దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం పశు సంరక్షణలో భాగంగా పలు సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజగా ఆమె "బీ ద బీర్' అనే లగ్జరీ బార్ లక్నోలో ప్రారంభించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుండగా, మరోవైపు ఆమెపై విమర్శలు మొదలయ్యాయి. బీజేపీ 'బీఫ్ ను బ్యాన్ చేసి, బీర్ ను పొంగిస్తోంది' అంటూ పలువురు ఎద్దేవా చేస్తుండగా, 'ముఖ్యమంత్రేమో మద్యం నిషేధిస్తానంటాడు, మంత్రులేమో మద్యం దుకాణాలకు క్యూకడుతున్నారు' అంటూ మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు.
ఇంకో నెటిజన్ మరింత ముందుకెళ్లి 'ముసుగు తొలగిస్తే కనబడే బీజేపీ అసలు ముఖం ఇదే' అంటూ వ్యాఖ్యానించాడు. బీజేపీ అభిమాని 'స్వాతి మేడమ్ ఏమిటీ పని' అంటూ ఆమెను ప్రశ్నించారు. ఇలా యూపీలో ముఖ్యమంత్రి, మంత్రులపై నెటిజన్లు విమర్శలు సంధిస్తున్నారు. కాగా, కేంద్రం బీఫ్ పై బ్యాన్ విధించిన అనంతరం మణిపూర్ లో బీజేపీ నేత ఒకరు తక్కువ ధరకే బీఫ్ ను అందజేస్తానంటూ ప్రకటించి కలకలం రేపారు. దానిపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. బీజేపీ తీరుపై ధ్వజమెత్తుతున్నారు.