: ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ కు శుభవార్త.. బుల్లితెరపై అలరించనున్న జూనియర్ ఎన్టీఆర్
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో వరుసగా హిట్లు సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవకుశ' సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన బుల్లితెరపై కూడా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్ మా లో ఆయన ఓ షో వ్యాఖ్యాతగా కనపడనున్నాడు. సోనీ చానల్‌లో పాప్యులర్ అయిన హిందీ ప్రోగ్రాం బిగ్‌బాస్ కు తెలుగు వెర్షన్ కూడా రాబోతోంది.
‘స్టార్ మా’లో ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. ఈ విషయాన్ని ఆ టీవీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. అందులో ఎన్టీఆర్ హోస్ట్‌గా కనిపించనున్నాడన్న వార్త ఆయన అభిమానుల్లో హుషారు నింపుతోంది. ఈ బిగ్ బాస్ కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి విదితమే. మరోవైపు తమిళంలో ‘బిగ్ బాస్’ షోకు కమల హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే స్టార్ మాలో నాగార్జున, చిరంజీవి వంటి స్టార్ హీరోలు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించి అలరించారు. ఎన్టీఆర్ వంటి యంగ్ హీరో ఓ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడన్న వార్త బుల్లితెర ప్రేక్షకులకు ఓ శుభవార్తే.