: సీఎం పదవేమైనా చాక్లెట్టా?... 'ఏసు సభ'లు పెట్టి డబ్బు పంచు!: జగన్ కు మోత్కుపల్లి సలహా
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ వంటి నేతనే గడగడలాడించిన నేత ఆయనని కొనియాడారు. తెలంగాణలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పిన ఆయన, ఎన్టీఆర్, చంద్రబాబు అనుచరుడిగా పనిచేసిన తాను, మరొకరి దగ్గర తలదించుకుని పనిచేయగలనా? అని ప్రశ్నించారు.
వైకాపా అధినేత వైఎస్ జగన్ వద్ద చాలా డబ్బుందని, డబ్బులు ఉన్న వాడిని నమ్మవద్దని బైబిల్ చెబుతోందని చెప్పారు. ఏసు సభ పేరిట వాడవాడలా సభలు పెట్టి, తాను సంపాదించిన అక్రమాస్తులను ప్రజలకు పంచాలని మోత్కుపల్లి సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవంటే చాక్లెట్ కాదని, ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని పొందలేరని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు.