: విద్యుత్ చోరుల ఆటకట్టడానికి యోగి ప్రభుత్వం కఠిన నిర్ణయం!
విద్యుత్ చోరులపై ఉక్కుపాదం మోపేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ 15 తర్వాత వారి ఆటలు కట్టించాలని నిర్ణయించింది. తొలిసారి విద్యుత్ చోరీ చేస్తూ పట్టుబడితే ఐదేళ్లు, రెండోసారి దొరికితే పదేళ్లు జైలు శిక్ష విధించేలా కఠిన నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాలుగా ‘కొండీ’లతో విద్యుత్ చోరీ నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రభుత్వాలు చోద్యం చూడడం తప్ప చోరులను నియంత్రించలేకపోయాయి. దీంతో విద్యుత్ చోరీకి ఇక చరమ గీతం పాడాలని నిర్ణయించిన యోగి ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ‘యాంటీ-పవర్ థెఫ్ట్ పోలీస్ స్టేషన్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యుత్ చోరులతోపాటు బిల్లులు ఎగవేసే వారిని కూడా అరెస్ట్ చేయనున్నారు. అంతేకాకుండా పెండింగ్ బిల్లుకు ఆరు రెట్లు అధికంగా వసూలు చేస్తారు. 10 కిలోవాట్ల కనెక్షన్‌పై అంతకుమించి వాడితే ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాదు అటువంటి వారికి రెండేళ్ల వరకు విద్యుత్ కనెక్షన్ నిలిపివేస్తారు.
ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ సొంత జిల్లా ఇటావాలో ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ నియోజకవర్గమైన కన్నౌజ్‌లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి యోగి సొంత జిల్లా అయిన ఘోరఖ్‌పూర్‌లో విద్యుత్ చోరీ తీవ్రస్థాయిలో ఉంది. ఇక్కడ దాదాపు 80 శాతం విద్యుత్ చోరీ జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న సర్కారు జూన్ 15 నుంచి చోరుల ఆట కట్టించేందుకు సిద్ధమవుతోంది.