: మాజీ ప్రేయసికి 'వీడియో'తో ఝలక్ ఇచ్చిన సనత్ జయసూర్య!
శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తన మాజీ ప్రేయసితో సన్నిహితంగా ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. నిన్న ఉదయం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంతో మాజీ ప్రేయసి కంగుతింది. ఈ నేపథ్యంలో శ్రీలంక జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ లో ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమైనట్టు సమాచారం. కాగా, జయసూర్య మాజీ ప్రేయసి శ్రీలంకకు చెందిన వ్యక్తి. ఓ గుడిలో గతంలో వాళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే జయసూర్య తన అసలు భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదు.
ఈ క్రమంలో కొన్నాళ్లకు జయసూర్య మాజీ ప్రేయసి ఓ మీడియా టైకూన్ ను వివాహమాడింది. ఇదిలా ఉండగా, ఈ వీడియో వైరల్ కావడంతో జయసూర్య మాజీ ప్రేయసి కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిన్నటి నుంచి నిలిపివేశారు. అయితే, ఈ వీడియోను తమ సెల్ ఫోన్లలో సదరు సంస్థ ఉద్యోగులు అప్పటికే చూశారనే విషయం తెలియడంతో, ఆ ఫోన్లను కూడా యాజమాన్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో వ్యవహారంపై జయసూర్యను వివరణ కోరేందుకు యత్నించిన మీడియాకు నిరాశే ఎదురైంది. ఈ వ్యవహారంపై మాజీ ప్రేయసి మాట్లాడుతూ, తనపై ప్రతీకారంతోనే జయసూర్య ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడని, తాము సన్నిహితంగా ఉన్న సమయంలో ఈ వీడియో తీశాడని వాపోయింది.