: పశువధపై నిషేధం విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిన మోదీ సర్కార్
ఆవులు సహా ఎద్దులు, బర్రెలు, ఒంటెలు, దూడలు వంటి పశువుల వధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పలు నిబంధనలను జారీచేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. పశువులను అమ్మే వ్యక్తులు కేవలం వ్యవసాయ పనుల నిమిత్తమే అమ్మడానికి తీసుకొచ్చామని ముందు లిఖిత పూర్వకంగా రాసివ్వాల్సి ఉంటుంది. వాటిని పశువధశాలలకు అమ్మడం లేదని కూడా అందులో పేర్కొనాలి. ఆ హామీ పత్రాన్ని పశువుల మార్కెట్ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ పశువులను కొనుక్కునే వ్యక్తులు రైతులేనని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
ఇక కొనుగోలుదారు కూడా వాటిని పశువధశాలకు అమ్మబోనని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఓ రాష్ట్రానికి చెందిన రైతుల నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కూడా అనుమతి లేకుండా పశువులను కొనుగోలు చేయడానికి వీల్లేదు. రాష్ట్ర సరిహద్దులకు 25 కిలోమీటర్ల పరిధిలో పశువుల మార్కెట్లు ఉండరాదని కూడా పర్యావరణశాఖ ఆదేశాలు జారీ చేసింది. పశు సంరక్షణ శాలలు తమ దగ్గర ఉన్న పశువులను దత్తతకు ఇచ్చే ముందు కూడా లిఖిత పూర్వకంగా రాసివ్వాలి. ఆవులను పశువధశాలలకు అమ్మడం లేదని హామీ ఇవ్వాలి.