: సమస్యలను నా దాకా రానీయవద్దు: అధికారులకు చంద్రబాబు క్లాస్
ఏవైనా సమస్యలు ఎదురైతే స్థానికంగా పరిష్కరించుకోవాలే తప్ప వాటిని తనదాకా రానీయవద్దని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు క్లాస్ పీకారు. అమరావతిలో ఈ ఉదయం రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుండగా, వైద్య ఆరోగ్య శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని ప్రతి అధికారి చెబుతుండటంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అవసరమైన చోట్ల ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డాక్టర్లను నియమించుకోవాలని సూచించిన ఆయన, ఆ అవకాశం ఇప్పటికే ప్రతి జిల్లా వైద్యాధికారికీ ఇచ్చామని, అయినా సమస్యలను తనదాకా ఎందుకు తీసుకు వస్తున్నారని అడిగారు. తన స్వగ్రామమైన నారావారి పల్లెలో కూడా డాక్టర్ల కొరత ఉందని చెప్పిన ఆయన, వైద్యుల కొరత ఉందని మరోసారి తన వద్ద చెప్పవద్దని కాస్తంత గట్టిగానే చెప్పారు. కిడ్నీ వ్యాధుల బాధితులు అధికంగా ఉన్న శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో రీసెర్చ్ సెంటర్లను తక్షణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.