: ఒక్కరు కూడా ముందుకు రాలేదు... ఈవీఎంల చాలెంజ్ రద్దు!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ట్యాంపరింగ్ కు అవకాశమిస్తాయని నిరూపించాలని ఎలక్షన్ కమిషన్ చేసిన చాలెంజ్ ని స్వీకరించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అన్ని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకూ ఆహ్వానం పలుకుతూ, గతవారంలో ఈసీ ఈ చాలెంజ్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి రాజకీయ పార్టీ ముగ్గురిని పంపవచ్చని కూడా ఈసీ పేర్కొంది. ఇక ఈవీఎం చాలెంజ్ కి ఒప్పుకునేందుకు రాజకీయ పార్టీలకు నేటి సాయంత్రం 5 గంటల వరకూ సమయం ఉండగా, ఇప్పటివరకూ ఒక్క పార్టీ కూడా తమ పేరును నమోదు చేయించుకోలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ సభ్యులను పంపేందుకు మరింత సమయం కావాలని లేఖ రాసింది.
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మదర్ బోర్డును హ్యాక్ చేసే అవకాశం ఇవ్వాలని కోరింది. ఈ మధ్యాహ్నం వరకూ ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో సాయంత్రం వరకూ చూసి, చాలెంజ్ ని రద్దు చేస్తున్నట్టు నేడే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీన్ని తమ విజయంగా ప్రచారం చేసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీమ్ జైదీ భావించడం లేదని, కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ కు అవకాశం లేనివని చెప్పడమే ఆయన ఉద్దేశమని, ఇందుకు సంబంధించి 5 గంటల తరువాత ప్రెస్ కాన్ఫరెన్స్ కు బదులుగా ప్రెస్ రిలీజ్ విడుదలవుతుందని ఓ అధికారి వెల్లడించారు. ఈవీఎంల హ్యాకింగ్ కారణంగా తమకు పడాల్సిన ఓట్లు బీజేపీకి వెళ్లడం వల్లే ఓడిపోయామని చెప్పిన బీఎస్పీ, ఆప్, కాంగ్రెస్ లతో పాటు సమాజ్ వాదీ, వామపక్షాలు, తృణమూల్, ఆర్జేడీ తదితర పార్టీలు ఈ చాలెంజ్ ని స్వీకరించేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.