: ట్రైలర్ చూసి కాపీ అంటారా?: అల్లు అరవింద్ పై 'రబ్తా' టీమ్ ఫైర్
తాము నిర్మించిన 'మగధీర' చిత్రాన్ని పోలినట్టుగా ఉందంటూ త్వరలో విడుదలకు సిద్ధమైన హిందీ సినిమా 'రబ్తా'పై అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, ఆ చిత్ర నిర్మాతలు దినేష్ విజయన్, భూషణ్ కుమార్ లు ఓ ప్రకటనను విడుదల చేశారు. కేవలం 2 నిమిషాల 14 సెకన్లు ఉన్న ట్రయిలర్ ను చూసి, తమ సినిమా కాపీ అని ఎలా నిర్ణయిస్తారని వారు ప్రశ్నించారు. ఇది తమ క్రియేటివిటీని అవమానించడమేనని, పలు సినిమాల్లోని సన్నివేశాల స్ఫూర్తితో దీన్ని రూపొందించామని, అంతమాత్రానికే కాపీ కొట్టామని ఆరోపించడం ఏంటని ఫైర్ అయ్యారు.
'మగధీర' టీమ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. ఆలోచనలపై కాపీరైట్ ఎవరికీ ఉండదని తెలిపారు. భారత సినీ పరిశ్రమ వినూత్న ఆలోచనలతో వచ్చే సినిమాలను ఆదరిస్తూనే ఉంటుందని, ఓ కాలరహిత ప్రేమకథగా దీన్ని తీశామని తెలిపారు. కాగా, అల్లు అరవింద్ దాఖలు చేసిన పిటిషన్ పై జూన్ 1న కోర్టు విచారణ జరపనున్న సంగతి తెలిసిందే.