: వెలుగులోకి కొత్త విషయం.. హత్యకు ముందు అమెరికా గూఢచారిని కలిసిన కిమ్ సోదరుడు
మలేసియాలో హత్యకు గురైన ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సోదరుడి కేసులో కొత్త విషయం ఒకటి వెలుగు చూసింది. హత్యకు ముందు కిమ్ (45) హోటల్ లిఫ్ట్‌లో మధ్య వయస్కుడైన కొరియన్-అమెరికన్‌ను కలిసినట్టు వీడియో ఫుటేజీ లభ్యమైంది. రిసార్ట్ ఐలండ్ అయిన లంగ్‌కావిలోని ఓ హోటల్ సూట్‌లో కిమ్ ఆ వ్యక్తితో రెండు గంటలపాటు కలిసి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, అతడితో పలుమార్లు మాట్లాడినట్టు తెలుస్తోంది. కిమ్ కంప్యూటర్‌కు ఉన్న యూఎస్‌బీ మెమొరీ కార్డులో అమెరికా గూఢచారికి సంబంధించి మరిన్ని కీలక విషయాలు ఉండవచ్చని భావిస్తున్నారు. గూఢచారిని కలిసిన నాలుగు రోజుల తర్వాత కిమ్ కౌలాలంపూర్ విమానాశ్రయంలో హత్యకు గురయ్యారు. తాజాగా బయటపడిన ఫుటేజీ ఈ హత్యకేసులో కీలకంగా మారే అవకాశం ఉంది.