: దేశంలో అతిపొడవైన బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని.. ఓ కన్నేసిన చైనా!
నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ నేడు (26న) దేశంలోనే అతిపొడవైన బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. అస్సాంలోని సాదియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ధోలాలను ఈ సేతువు కలుపుతుంది. ముంబైలోని బాంద్రా-వోర్లి సీ లింక్ బ్రిడ్జి కంటే ఇది 3.55 కిలోమీటర్ల పొడవైనది. సాదియా-ధోలా బ్రిడ్జి ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 6 గంటల ప్రయాణ దూరాన్ని కేవలం గంటకు తగ్గించనుంది. అలాగే 60 టన్నుల యుద్ధ ట్యాంకును కూడా దీనిపై నుంచి తరలించేంత దృఢంగా దీనిని నిర్మించారు.
చైనో-ఇండియా సరిహద్దుకు సమీపంలో ఉండడంతో యుద్ధ సమయంలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సైన్యానికి వేగంగా చేరవేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్, అసోం ప్రజలు ఎయిర్‌పోర్టు, రైలు మార్గాలను వేగంగా చేరుకునే వెసులుబాటును ఈ బ్రిడ్జి కల్పిస్తోంది. వంతెన నిర్మాణం 2011లో ప్రారంభమైంది. ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.950 కోట్లు. అసోం రాజధాని దీస్ పూర్‌కు 540 కిలోమీటర్లు, అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపే ఉంది. దీంతో డ్రాగన్ కంటీ ఇటువైపు ఓ కన్నేసి ఉంచింది.