: ఆఫ్ఘన్ ఎంపీలా మజాకా... గమ్యం చేరిపోయిన విమానాన్ని వెనక్కి రప్పించారు!
ఆఫ్ఘనిస్థాన్ ఎంపీలు అధికార దర్పం ప్రదర్శించారు. తాము ఎయిర్ పోర్టుకు చేరుకోవడం ఆలస్యమైనంత మాత్రాన తమకోసం ఎదురు చూడకుండా వెళ్లిపోవడమేంటని మండిపడుతూ, అప్పటికే గమ్యం చేరిపోయిన విమానాన్ని వెనక్కి రప్పించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఎంపీలు అబ్దుల్ రెహమాన్ షహీదని, హుస్సేన్ నసేరి కాబుల్ నుంచి బమియాన్ వెళ్లాల్సి ఉండగా, ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా చేరుకున్నారు. అయితే అప్పటికే విమానం వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీలు, బమియాన్ లోని తమ మద్దతుదారులకు ఫోన్ చేసి, ఎయిర్ పోర్టులో సదరు విమానం ల్యాండ్ అవ్వకుండా చేయాలని ఆదేశించారు. దీంతో వారి అనుచరులు రెచ్చిపోయి ఎయిర్ పోర్టు రన్ వేపై పెద్ద పెద్ద రాళ్లు ఉంచారు.
దీంతో విమానం ల్యాండింగ్ కు ఇబ్బందిగా మారడంతో విమానం తిరిగి కాబూల్ ఎయిర్ పోర్టుకి చేరుకుంది. వెంటనే ఎంపీలు విజయగర్వంతో విమానం ఎక్కారు. ఈ సమయంలో విమానంలో 30 మంది ఉన్నారు. అనంతరం తిరిగి బమియాన్ బయల్దేరగా, ఈ సారి ల్యాండింగ్ కు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా విమానాన్ని వెనక్కి తీసుకురావడం పట్ల సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ హుమాయున్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో విమానం భద్రతా సిబ్బంది సహా ఐదుగురుని అరెస్టు చేసినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.