: పాక్ తో మ్యాచ్ పై ప్రశ్నకు... విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ!
వచ్చేనెల 1 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు టీమిండియా ఇంగ్లండ్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ బయలుదేరే ముందు ముంబయిలో మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తరుచూ భారత్- పాక్ మ్యాచ్ గురించే ఆ విలేకరి ప్రశ్నలు అడుగుతుండగా కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ.. చాంపియన్స్ ట్రోఫీ గెలవాలంటే చెమటోడ్చాల్సిందేనని, పోటీ చాలా ఎక్కువగా ఉంటుందని అన్నాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తికనబరుస్తారని, అయితే తమకు మాత్రం అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమేనని, మామూలుగానే ఉంటామని అన్నాడు.
తర్వాత ఓ విలేకరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాక్‌తో మ్యాచ్ ఆడటం మంచిదేనా? అని అడిగాడు. దానికి కోహ్లీ ముందుగా మీరేమి అనుకుంటున్నారని అన్నాడు. దీంతో ఆ విలేకరి కెప్టెన్‌గా ఉన్న మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి అడుగుతున్నానని అన్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ.. నిజంగా దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవల్సిన అవసరం లేదని, తమ కంటే ముందే దీనిపై మీరు ఓ అభిప్రాయానికి వచ్చేసి ఉంటారు కదా? అని సమాధానం ఇచ్చాడు.