: సుష్మా అమ్మకు నా కృతఙ్ఞతలు: భారత్ లో అడుగుపెట్టిన ఉజ్మా
ఈ నెల ప్రారంభంలో ఇస్లామాబాద్ వెళ్లిన ఉజ్మాను అనే భారత మహిళను తాహిర్ అలీ అనే వ్యక్తి తుపాకీతో బెదిరించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భారత హై కమిషన్ సాయంతో తిరిగి భారత్ కు చేరుకున్న ఉజ్మా మీడియాతో మాట్లాడింది. ‘నాకు సాయం చేసిన సుష్మా అమ్మకు, హై కమిషన్ అధికారులకు కృతఙ్ఞతలు. పాకిస్థాన్ లో అడుగుపెట్టడం తేలికే, కానీ, తిరిగి రావడమే కష్టం.. అదో మృత్యుకుహరం. మోసపూరిత వివాహాలకు బలైన మహిళలే కాదు, అంగీకారంతో పెళ్లి చేసుకున్న మహిళలు కూడా పాకిస్థాన్ లో తీవ్ర వేదన అనుభవిస్తున్నారు’ అని వాపోయింది. అనంతరం, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, ఉజ్మా తిరిగి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, పాక్ విదేశాంగ, అంతర్గత వ్యవహారాల శాఖల సహకారం వల్లే ఉజ్మా ఇక్కడికి రాగలిగిందని అన్నారు. ఈ కేసును వాదించే బాధ్యత తీసుకున్న షాన్వాజ్ నూన్ కు సుష్మా ధన్యవాదాలు చెప్పారు.