: ఏపీకి మోదీ ఏం ఇచ్చారని అడుగుతున్నారు.. నేను చెబుతా సమాధానం!: విజయవాడలో అమిత్ షా
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నుంచి బీజేపీ కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ రోజు బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... విజయవాడ అంటే విజయానికి ఆలయమని అన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. ఏపీలో 25 వేల బూత్ కమిటీలు నియమించుకోవడం సంతోషమని అన్నారు. 12 కోట్ల సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు. ఈ మహా సమ్మేళనం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. బూత్ స్థాయి సమావేశాలను విజయవంతం చేసిన రాష్ట్ర కమిటీకి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ ఏపీకి ఏం చేశారని కొందరు అంటున్నారని, తాను మోదీ తరఫున జవాబు ఇస్తానని అమిత్ షా చెప్పారు. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఎయిమ్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, మెడికల్ సీట్ల పెంపకం వంటి ఎన్నో చేసిందని అన్నారు. పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టులు ఇచ్చిందని, దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని అన్నారు. ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇచ్చిందని అన్నారు. అంతేగాక, ఎన్నో ప్రయోజనాలను చేకూర్చిందని అన్నారు. ఏపీకి ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమను ప్రత్యేక హోదా అంటూ ప్రశ్నిస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన అంశాన్ని ఉంచని కాంగ్రెస్ ఇప్పుడు తమను విమర్శిస్తుందని అన్నారు. తాము ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలు ఏపీకి అందిస్తున్నామని అన్నారు. ఏపీకి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.