: ప్రతిపక్ష నేతలను భోజనానికి పిలిచి, కేజ్రీవాల్ ను పక్కన బెట్టిన సోనియాగాంధీ


శుక్రవారం నాడు విపక్ష పార్టీల నేతలందరినీ పార్లమెంట్ హౌస్ లో భోజనానికి రావాలని స్వయంగా ఆహ్వానించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను మాత్రం పక్కనబెట్టారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా, విపక్షాలన్నీ కలసి ఓ అభ్యర్థిని నిలపాలన్న అంశంపై చర్చించేందుకు ఈ విందును ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సరిగ్గా నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న రోజునే విపక్షాల బలం చూపించేందుకు సోనియాగాంధీ నిర్ణయించుకుని ఈ విందును ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

స్థానిక రాజకీయాలను, విభేదాలను పక్కనబెట్టి సోనియాగాంధీ స్వయంగా ఫోన్ చేసి వామపక్ష నేత సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, డీఎంకే నేత స్టాలిన్ తదితరులను ఆహ్వానించారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ అటు సోనియాతో, ఇటు కేజ్రీవాల్ తో విడివిడిగా సమావేశమయ్యారు. ఇప్పటివరకూ విపక్షాలు నిర్వహించిన ఏ కార్యక్రమంలోనూ కేజ్రీవాల్ పాల్గొనకపోవడం వల్లే ఆయన్ను పిలవలేదని తెలుస్తోంది. కాగా, తాము స్వయంగా హాజరు కాలేమని, ప్రతినిధులను పంపుతామని మాయావతి, స్టాలిన్ స్పష్టం చేయగా, లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీకి బయలుదేరారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News