: కలెక్టర్ అమ్రపాలి మాటలు వింటే వచ్చే ఉద్యోగం కూడా పోతుంది: కడియం శ్రీహరి కౌంటర్
ఇంటర్వ్యూలో గెలిచి ఉద్యోగం పొందాలంటే కొన్ని అబద్ధాలు చెప్పక తప్పదని, ఐదు నిమిషాలు పని చేసే వారు కూడా రెండు గంటలు పని చేస్తామని చెప్పాల్సి వుంటుందని వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ విద్యా మంత్రి కడియం శ్రీహరి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతిభతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలే తప్ప, అబద్ధాలు చెబితే అడ్డంగా దొరికిపోతారని హితవు పలికారు. మార్కుల జాబితా, అర్హతా పత్రాలు, అనుభవం విషయంలో ధ్రువపత్రాలు నిజాలనే చెబుతాయని, ఇంటర్వ్యూ చేసే బోర్డులో తెలివైన వారుంటే, అభ్యర్థి తప్పు చెబుతున్నాడని వెంటనే పసిగడతారని హెచ్చరించారు. దీంతో రావాల్సిన ఉద్యోగం కూడా పోతుందని చెప్పారు. నిన్న వరంగల్ ములుగు రోడ్డులో జాబ్ మేళా జరుగగా, అందులో పాల్గొన్న అమ్రపాలి, ఉద్యోగం కోసం కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వుంటుందని అనగా, అక్కడే ఉన్న కడియం ఆమె వ్యాఖ్యలపై కాస్తంత గట్టిగానే స్పందించారు.