: తేజాస్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలును తొలిరోజే 'కంపు' చేసిన ప్రయాణికులు.. రైల్వే శాఖ షాక్!
ముంబై-గోవా మధ్య తొలిసారి పరుగులు పెట్టిన తేజాస్ హైస్పీడ్ సెమీ లగ్జరీ రైలులో ప్రయాణికులు వ్యవహరించిన తీరుతో రైల్వే శాఖ షాక్‌కు గురైంది. కొందరు ప్రయాణికులు రైలులోని ఎల్‌సీడీ స్క్రీన్లను ధ్వంసం చేయగా, మరికొందరు హెడ్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. టాయిలెట్లను దుర్గంధంగా మార్చేశారు. ఆ పరిస్థితిలో రైలును చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రైలులో ప్రయాణికులు వ్యవహరించిన తీరుపై స్పందించిన రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన జారీ చేశారు. రైలును తమ సొంత ఆస్తిలా భావించాలని, పరిశుభ్రంగా ఉంచాలని, లోపలి వస్తువులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కరమాలిలో బయలుదేరిన రైలు ముంబై సీఎస్‌టీకి రాత్రి 11 గంటల ప్రాంతంలో చేరుకుంది. అయితే అందులోని ఇంటీరియర్ మొత్తం కళతప్పి ఉండడాన్ని అధికారులు గమనించారు. కాగా, ఈ రైలుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ శుక్రవారం వరకు టికెట్స్ పూర్తిగా బుక్ అయిపోగా, వినాయకచవితి సీజన్ కు కూడా సీట్లు రిజర్వ్ అయిపోయినట్టు తెలుస్తోంది. కాగా, రైలు కరమాలి స్టేషన్ దాటిన తర్వాత రైలులో విధ్వంసం ప్రారంభమైనట్టు ఓ ప్రయాణికుడు తెలిపాడు. కొందరు ఎల్‌సీడీ స్క్రీన్లను పెకిలించి వేశారని, బహుశా ఇంటికి తీసుకెళ్లేందుకే వారాపని చేసి ఉంటారని పేర్కొన్నాడు. అలాగే వ్యాక్యూమ్ టాయిలెట్‌లను కంపు చేశారని వివరించాడు. ప్రయాణికులు రైలులో ఇటువంటి చర్యలకు దిగితే అత్యాధునిక రైళ్లను ప్రారంభించే ముందు రైల్వే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుందని డివిజనల్ రైల్వే కార్యకర్త నిర్మల్ తికమ్‌ఘర్ అభిప్రాయపడ్డారు.