: ఏపీ భూసేకరణ చట్టానికి ఆమోదం తెలపకండి: రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరణలు చేసిన భూసేకరణ చట్టాన్ని ఆమోదించవద్దని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో పాటు ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు ఈరోజు రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, ఏపీ భూసేకరణ చట్టాన్ని ఆమోదించవద్దని రాష్ట్రపతిని కోరామని తెలిపారు. బిల్లులో ఉన్న న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తామని రాష్ట్రపతి తమకు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. భూమి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలనే అంశాన్ని బిల్లులో విస్మరించారని... అసలు విషయాన్ని పట్టించుకోకుండా 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేశారని విమర్శించారు. భూసేకరణలో రైతులకు అందాల్సిన ప్రయోజనాలను తగ్గించారని... ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా యత్నించారని మాజీ ఎంపీ జేడీ శీలం అన్నారు. రైతులను, కూలీలను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.