: భారత్ తో యుద్ధానికి సన్నాహాల్లో భాగంగానే పాక్ ఈ చర్యలకు పాల్పడుతోందా?
నియంత్రణ రేఖ వద్ద తరుచూ కాల్పులకు తెగబడుతూ భారత్‌ను రెచ్చగొడుతున్న పాకిస్థాన్‌కు ఇటీవలే భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. భారత సైన్యం చేసిన దాడులతో పాక్ పలు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భారత్-పాక్ సరిహద్దులోని సియాచిన్ గగనతలంలో తమ వైమానిక దళం కసరత్తు నిర్వహించినట్లు పాకిస్థాన్ మీడియా ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. భారత్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో తమ దళాలు అప్రమత్తమయ్యాయంటూ పాక్ మీడియా పేర్కొంది.
భారత్ పట్ల పగతో వున్న పాకిస్థాన్ ప్రతీకారంతో రగిలిపోతోందని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధ సన్నాహకాల్లో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లోని ఎయిర్ బేస్‌ను పాక్ వాయుసేన అధిపతి సోహైల్ అమన్ సందర్శించినట్లు భావిస్తున్నారు. సియాచిన్ మీదుగా మిరేజ్ యుద్ధ విమానాలు సోహైల్ అమన్ సమక్షంలోనే ఎగురుతున్నాయని భావిస్తున్నారు. పాక్ పత్రికలు చేసిన కథనాలను భారత అధికారులు మాత్రం కొట్టిపారేస్తున్నారు.