: రజనీకాంత్ పై నిప్పులు చెరిగిన జయలలిత మేనకోడలు దీప!


ప్రముఖ సినీ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై అస్పష్ట ప్రకటన చేసిన నాటి నుంచి తమిళనాట వివిధ పార్టీల మద్దతుదారులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై పార్టీ అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు చెన్నైలో ఆమె మాట్లాడుతూ, తమిళ సినిమాల ద్వారా కోట్లు గడించిన రజనీ ఇప్పటివరకు తమిళులకు చేసిన మేలు ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. పోనీ, ఆయన కావేరీ జల వివాదంపై తన వైఖరి వెల్లడించగలరా? అని ఆమె ప్రశ్నించారు.

కనీసం తమిళ ఈలంపై ఏవైనా వ్యాఖ్యలు చేయగలరా? అని అడిగారు. రజనీ రాజకీయ ప్రవేశాన్ని తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. తమిళ రాజకీయ వ్యవస్థ సక్రమంగా లేదని విమర్శిస్తున్న రజనీకాంత్‌ ముందుగా సినీ సిస్టమ్‌ ను చక్కదిద్దడం మంచిదని హితవు పలికారు. తమిళ రాజకీయ వ్యవస్థ సరిగా లేదని చెప్పటానికి రజనీకి ఉన్న అర్హతలేమిటో తనకు తెలియడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ సరిగా లేదని చెప్పే రజనీకాంత్ ముందుగా నడిగర్‌ సంఘంలో మూడు వేల మంది సభ్యులుంటే మూడువేలకు మించిన సమస్యలు ఉన్నాయని, వాటిని చక్కదిద్దాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News