: అగ్నిప్రమాదాల నివారణపై ముఖ్యమంత్రి సమీక్ష.. ఆ మరునాడే కాలిబూడిదైన టెలికం ఆఫీసు
బీహార్ రాజధాని పాట్నాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టెలికమ్యూనికేషన్ కార్యాలయం మంగళవారం మంటల్లో కాలి బూడిదైంది. అగ్నిప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించిన మరునాడే టెలికం ఆఫీస్ మంటలకు ఆహుతి కావడం చర్చనీయాంశంగా మారింది. అగ్నిప్రమాదంలో నాలుగు అంతస్తుల్లోని మూడు పూర్తిగా దగ్ధమయ్యాయి. మల్టిప్లెక్సర్లుగా పిలిచే విలువైన టెలికమ్యూనికేషన్ పరికరాలు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో వాటిల్లిన నష్టంపై అంచనాలు వేస్తున్నట్టు కార్యాలయ మేనేజర్ రవీష్ కుమార్ తెలిపారు. గదిలోని ఏసీ పేలిపోవడం వల్లనే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక సమాచారం. కేంద్రప్రభుత్వ కార్యాలయమైన ఇందులో ఒక్కటంటే ఒక్క అగ్నిమాపక పరికరం కూడా లేకపోవడం గమనార్హం.