: 30 శాతం వడ్డీ ఆశపెట్టి.. కోట్లు సేకరించి.. ఉడాయించిన కోల్ కతా వాసి... లబోదిబోమంటున్న బాధితులు!
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాకు చెందిన సౌమెన్ బెనర్జీ (46) అనే వ్యక్తి మేడిపల్లి, చెంగిచర్ల ప్రాంతంలో భార్య సుపెర్నో బెనర్జీ (35) కుమారుడు సుపోవా బెనర్జీ (14)తో కలిసి నివాసం ఉండేవాడు. అందరితో కలుపుగోలుగా ఉండే సౌమెన్ బెనర్జీ ఆ ప్రాంతంలో 30 శాతం అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి పలువురి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. అతని దగ్గర 50 మంది స్థానికులు 30 శాతం వడ్డీకి భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేశారు. ఇలా డబ్బులు వసూలు చేయడమే కాకుండా స్థానికంగా ఉన్న బ్యాంకుల్లో కూడా తప్పుడు పత్రాలు పెట్టి భారీ ఎత్తున లోన్లు కూడా పొందాడు.
ఇందుకోసం నకిలీ ఐడీ కార్డులతో పాటు, పాన్ కార్డు కూడా తయారు చేశాడు. ఇలా డబ్బు సమీకరించిన సౌమెన్ బెనర్జీ జనవరి 31వ తేదీ నుంచి అకస్మాత్తుగా మాయమయ్యాడు. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ముందుగానే ప్లాన్ ప్రకారం అందర్నీ మోసం చేయాలని నిర్ణయించుకున్న సౌమెన్ బెనర్జీ తనకు సంబంధించిన ఆధారాలు ఏవీ దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. అంతే కాకుండా 15 నకిలీ సిమ్ కార్డులు వినియోగించాడు. దీంతో సౌమెన్ బెనర్జీ, అతని కుటుంబ సభ్యుల ఫోటోలు విడుదల చేసిన పోలీసులు, వారి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.