: మాంచెస్టర్ దాడి గురించి ముందే హెచ్చరించిన లాయర్...అబుబకర్ ప్రకటన అవాస్తవమని కూడా స్పష్టీకరణ!
మాంచెస్టర్ లోని ఉగ్రదాడి గురించి మాక్స్ హిల్ అనే బ్రిటన్ న్యాయవాది ముందుగానే హెచ్చరించినా నిఘా వర్గాలు పట్టించుకోకపోవడంతోనే దాడి జరిగిందని అంటున్నారు. మాక్స్ హిల్ ఉగ్రవాదులపై పరిశోధనలు చేస్తుంటారు. టెర్రరిజం, బ్రిటిష్ చట్టాలపై ఆయన అధ్యయనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థపై చాలా పరిశోధన చేశారు. ఈ క్రమంలో రెండు నెలల కిందట ఐఎస్ఐఎస్ చీఫ్ అబుబకర్ బాగ్దాదీ వీడ్కోలు ప్రసంగం చేస్తూ... ఐఎస్ఐఎస్ ఓటమి పాలైందని, మిగిలిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులంతా ఆత్మహత్య చేసుకోవాలని సూచించడాన్ని ఆయన కొట్టిపారేశారు. సిరియా, ఇరాక్ లలో చావుదెబ్బతిన్న ఐఎస్ఐఎస్ తన వ్యూహం మార్చుకుందని ఆయన చెబుతున్నారు.
ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే బాగ్దాదీ ముగింపు ప్రకటన చేశాడని ఆయన హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ప్రకటనను ఎవరూ నమ్మలేదు. ఇరాక్, సిరియాలలో దెబ్బతిన్నప్పుడే వ్యూహం మార్చిన బాగ్దాదీ... బ్రిటన్ ను టార్గెట్ చేశాడని అంటున్నారు. అందుకే మాంచెస్టర్ ఎరీనాలో ఉగ్రదాడికి పాలపడ్డారని, భవిష్యత్ దాడులు మరింత తీవ్రంగా, భయంకరంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. కొత్తతరహా దాడులతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ఐఎస్ విజృంభిస్తుందని ఆయన తెలిపారు. వెస్ట్ లండన్ పేలుళ్ల కంటే తీవ్రమైన దాడులకు ఐఎస్ఐఎస్ వ్యూహరచన చేసిందని ఆయన చెబుతున్నారు. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.
సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్న సమయంలో వందలాది మంది బ్రిటన్ యువకులు వెళ్లి సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరారని ఆయన చెప్పారు. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థ పూర్తిగా బలహీన పడడంతో వారంతా వెనక్కి తిరిగి వస్తున్నారని, వారితో ప్రమాదమని మాక్స్ హిల్ చెబుతున్నారు. ఎప్పటికైనా వారంతా దేశానికి, దేశప్రజలకు ప్రమాదకరంగా మారుతారని ఆయన చెబుతున్నారు.