: మాంచెస్టర్ ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్న భారతీయ వైద్యురాలు!
ప్రపంచాన్ని మరోమారు షాక్‌కు గురిచేసిన మాంచెస్టర్ పేలుళ్ల నుంచి భారతీయ వైద్యురాలు, ఆమె కుమార్తె తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరగడానికి సరిగ్గా ఏడు నిమిషాల ముందు వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడంతో ప్రాణాలు దక్కించుకోగలిగారు. సోమవారం రాత్రి మాంచెస్టర్‌లో మాంచెస్టర్ ఎరీనా వద్ద ఉగ్రదాడి జరగడానికి ముందు జైపూర్‌కు చెందిన వైద్యురాలు సోనాల్ పాఠక్ (41), ఆమె 13 ఏళ్ల కుమార్తె శ్రేయ, ఆమె స్నేహితురాలు ఆన్య అక్కడే ఉన్నారు.
‘‘షో చివరిలో రద్దీ నుంచి బయటపడడానికి మా వాహనాన్ని కొంత దూరంలో పార్క్ చేశాం. చివరి సాంగ్ అయిపోయిన వెంటనే బయటపడేందుకు ఎదురుచూస్తున్నాం. షో అవగానే వడివడిగా అడుగులేస్తూ పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నాం. మేం బయటకు వచ్చిన సరిగ్గా ఏడు నిమిషాల తర్వాత పేలుడు సంభవించింది’’ అని పాఠక్ గుర్తు చేసుకున్నారు. తాము రాత్రి 10:23 గంటలకు బయటకు వస్తే 10:30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే తన పార్కింగ్ అండర్ గ్రౌండ్లో ఉండడంతో తాను పేలుళ్లను చూడలేదని, తనకు పేలుడు శబ్దాలు వినిపించలేదని పేర్కొన్నారు. పార్కింగ్ నుంచి బయటకు వచ్చాక గానీ ఈ దారుణ ఘటన గురించి తెలియలేదని వివరించారు. మాంచెస్టర్ ఎరీనా వద్ద శక్తిమంతమైన బాంబు పేలడంతో 20 మంది మృతి చెందగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.