: వీవీఐపీల ప్రయాణం కోసం ఎయిర్‌ఫోర్స్ వన్ లాంటి విమానం సిద్ధమవుతోంది.. వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి!
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితర వీవీఐపీల సుదీర్ఘ ప్రయాణల కోసం ప్రత్యేక విమానాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో ఈ విమానం అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.
బోయింగ్ 777-300 విస్తృత శ్రేణి (ఈఆర్) విమానాలను వచ్చే జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఒక్కోటి చొప్పున ఎయిరిండియా అందుకోనుంది. ఈ మూడింటిలో ఒకదానిని వీవీఐపీల ప్రయాణాల కోసం ఉపయోగించనున్నారు. దీంతో 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్న జంబోజెట్లకు విశ్రాంతి లభించనుంది.
ఎయిరిండియాకు అందనున్న ఈ విమానాలను బోయింగ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. వీటిలో రెండింటిలో అత్యాధునిక సదుపాయాలు, కమ్యూనికేషన్, పటిష్ట భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు. ఒకరకంగా చెప్పాలంటే, అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలా తీర్చిదిద్దనున్నారు. వచ్చే ఏడాది చివరినాటికి ఈ విమానం అందుబాటులోకి రానుంది.