: భారత ఆర్మీ ఇలాగే దాడులు చెయ్యాలి... లాహోర్‌లో మన త్రివర్ణ పతాకం ఎగరాలి: శివసేన
సరిహద్దు ప్రాంతంలో దాడులకు పాల్పడుతూ, ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రోత్సాహం అందిస్తూ రెచ్చిపోతున్న పాకిస్థాన్ కు భారత్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. నౌషెరాలోని పాక్ శిబిరాలను ధ్వంసం చేశామని ఈ రోజు ఆర్మీ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్ పార్టీల నేతలు స్పందిస్తూ... భారత సైన్యాన్ని అభినందించారు. పాక్ స్థావరాలపై జరిపిన దాడులు ప్రశంసనీయమని శివసేన ప్రతినిధి అరవింద్ సావంత్ అన్నారు. భారత్ ఇలాగే దూసుకెళ్లాలని, లాహోర్ వెళ్లి మరీ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి ఆర్ఎస్ సుర్జేవాలా మాట్లాడుతూ... పాక్ శిబిరాలను ధ్వంసం చేయడంలో భారత సైన్యం ప్రదర్శించిన సాహసానికి సెల్యూట్ అని వ్యాఖ్యానించారు. ఆ శిబిరాల వల్లే ఇండియాలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారని ఆయన అన్నారు.