: నగదు డిపాజిట్ పై క్యాష్ బ్యాక్: బంపరాఫర్ ఇచ్చిన పేటీఎం బ్యాంక్
2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారులను చేర్చుకోవడమే లక్ష్యంగా బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన పేటీఎం వస్తూనే బంపరాఫర్లను ప్రకటించింది. తమ వద్ద ఖాతా ప్రారంభించేందుకు కనీస బ్యాలెన్స్ అంటూ ఏమీ ఉండదని చెప్పింది. ఖాతాల్లోని నగదుపై 4 శాతం వడ్డీని ఇస్తామని, డిపాజిట్లపై క్యాష్ బ్యాక్ ఉంటుందని, ఆన్ లైన్ లావాదేవీలపై ఎటువంటి రుసుమునూ వసూలు చేయబోమని తెలిపింది. కాగా, చైనా దిగ్గజం అలీబాబా, జపాన్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ వెన్నంటి ఉండగా, ప్రాథమికంగా రూ. 400 కోట్ల పెట్టుబడితో పేటీఎం తన సేవలను ప్రారంభించింది. ఇప్పటికే ఎయిర్ టెల్, ఇండియా పోస్ట్ సంస్థలు బ్యాంకింగ్ సేవలను ప్రారంభించగా, ఈ తరహా ఆర్థిక సేవల్లోకి ప్రవేశించిన మూడో సంస్థ పేటీఎం.
"ఓ కొత్త మోడల్ బ్యాంకింగ్ సేవలను అందించే అవకాశం ఆర్బీఐ మాకు ఇచ్చింది. ఇది మాకెంతో గర్వకారణం. కస్టమర్ల డబ్బును ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నాం. తద్వారా దేశాభివృద్ధిలో భాగం అవుతాం. మా ఆస్తులను రిస్క్ ఎక్కువగా ఉండే ఏ రంగంలోనూ ఇన్వెస్ట్ చేయబోము" అని పేటీఎం బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. తమ వద్ద డిజిటల్ వ్యాలెట్ ఖాతాలను కలిగున్న వారు, కేవైసీ నిబంధనలకు అనుగుణంగా వివరాలను అందించి ఖాతాలను పొందవచ్చని తెలిపారు. రూ. 25 వేలను ఖాతాలో డిపాజిట్ చేసిన వెంటనే రూ. 250ని క్యాష్ బ్యాక్ గా అందిస్తామని తెలిపారు. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ తదితర ఆన్ లైన్ లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చని అన్నారు. తొలి సంవత్సరంలో 31 శాఖలను 3 వేల కస్టమర్ సర్వీస్ పాయింట్లను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు శేఖర్ శర్మ తెలిపారు.