: ముందే హెచ్చరించిన అమెరికా... 'రొటీన్' అనుకుని భారీ మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్!
యూరప్ లోని పలు దేశాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ చాలా యాక్టివ్ గా ఉన్నాయని, ఏ సమయంలో ఎక్కడైనా దాడులు జరిగే అవకాశాలు ఉన్నందున అన్ని దేశాలూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అమెరికన్లు యూరప్ దేశాల్లో పర్యటిస్తుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా నిఘా వర్గాలు ముందే హెచ్చరించినా, వీటిని 'రొటీన్' హెచ్చరికలే అన్నట్టు లైట్ గా తీసుకున్న ఇంగ్లండ్, నేడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది.
మాంచెస్టర్ ఎరీనాలో ఓ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతున్న వేళ జరిగిన పేలుడులో 20 మంది మరణించగా, మరో 50 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ నెల 2వ తేదీన ట్రంప్ ప్రభుత్వం యూరప్ దేశాలను హెచ్చరిస్తూ నోటీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం, దాడులకు అవకాశం ఉందని యూఎస్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం అరబ్ దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్, నేడు ఇజ్రాయిల్ చేరుకున్నారు. ఆయన విమానంలో ఉన్న సమయంలో మాంచెస్టర్ దాడి జరుగగా, విషయాన్ని అధికారులు ఆయనకు చేరవేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన్నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.