: అన్నాడీఎంకేలో వర్గపోరు.. తెరపైకి వైగై సెల్వన్.. ప్రశ్నార్థకంగా మారిన పార్టీ మనుగడ!
జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో మొదలైన వర్గపోరు ప్రస్తుతం ఆ పార్టీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. ఇప్పటికే శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలుగా విడిపోయిన పార్టీలో తాజాగా వైగై సెల్వన్ నేతృత్వంలోని మరో వర్గం తెరపైకి వచ్చింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వర్గం ఆందోళనగా ఉంది. ఇటీవల కొంగు మండలం శాసనసభ్యులు, ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి పళనికి తలనొప్పులు తీసుకురాగా ఆ తర్వాత మాజీ మంత్రి తోపు వెంకటాచలం నేతృత్వంలోని 11 మంది ఎమ్మెల్యేలు రహస్యమంతనాలు జరిపారు. దీంతో వారు వేరు కుంపటి ఖాయమన్న వార్తలు వినిపించాయి.
పార్టీలోని ఒక్కో నేత ఒక్కో గ్రూపును తెరపైకి తీసుకొస్తుండడంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి పళనిస్వామి నష్టనివారణ చర్యలు చేపట్టినా అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. తాజాగా వైగై సెల్వన్ ఆధ్వర్యంలోని మరో వర్గం పళనికి కొత్త తలనొప్పులు తీసుకురావడమే కాదు, పార్టీ మనుగడను సైతం ప్రశ్నిస్తోంది. ఆయన ఆధ్వర్యంలో కొందరు శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నేతలు రహస్య మంతనాలు నిర్వహించారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ వర్గంతో పళని సర్కారు ఇబ్బంది పడుతుండగా తాజా పరిణామం ముఖ్యమంత్రిని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. పార్టీలో రోజుకొకటి చొప్పున తెరపైకి వస్తున్న గ్రూపుతో ‘అమ్మ’ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా పోతోంది.