: ఇంగ్లాండ్ పేలుడు ఘటన: ఒక్కసారిగా 'మృత్యు' సంగీతం... ప్రాణాలు దక్కించుకునే క్రమంలో తొక్కిసలాట!
ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ ఎరీనాలో అరియాణా గ్రాండే సంగీత కచేరికి భారీ ఎత్తున యువతీయువకులు హాజరయ్యారు. ఈ ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన సంగీత కచేరీకి సుమారు 21 వేల మంది హాజరుకావడం విశేషం. అంతా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. కాసేపట్లో కాన్సర్ట్ ముగిసిపోతుంది. ఇంతలో స్టేడియం మధ్యలో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగింది. అయితే ఏం జరిగిందో తెలుసుకునేలోపు స్టేడియంలో కలకలం రేగింది. హాహాకారాలు మిన్నంటాయి. తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. బాంబు పేలుడుతో కొందరి శరీర భాగాలు ఎగిరిపడ్డాయి.
దీంతో 20 మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా... 50 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రాధమిక సమాచారం. క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలతో... ఇతరులు బెంబేలెత్తిపోయారు. దీంతో పరుగులంకించుకున్నారు. ఎక్కడికి పరుగెత్తాలో తెలియదు... కానీ మరో విస్ఫోటనం జరిగితే దానికి అందకుండా పరుగెత్తాలి... అందరిముందున్న లక్ష్యం ఇదే కావడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఫెన్సింగ్ లు దూకుతూ మరికొంత మంది గాయపడ్డారు. పరుగెత్తుతూ కిందపడి మరికొంతమంది గాయపడ్డారు. ఇలా ప్రాణభీతితో మాంచెస్టర్ ఎరీనాలోని ఆరియాణా గ్రాండే దద్దరిల్లిపోయింది. ఇంతలో రంగప్రవేశం చేసిన పోలీసులు, పేలకుండా ఉన్న బాంబును నిర్వీర్యం చేశారు. దాడికి బాధ్యులు, కారణాలు తెలియాల్సి ఉంది.