: అమిత్ షా పర్యటనపై ఆచితూచి స్పందించాలని కేసీఆర్ నిర్ణయం.. విమర్శలు వద్దని నేతలకు సూచన
తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అప్పుడే ఎటువంటి విమర్శలకు దిగవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు సూచించారు. అమిత్ షా ప్రసంగాలపై తక్షణం స్పందించి ఏది పడితే అది మాట్లాడవద్దంటూ అధిష్ఠానం నుంచి నేతలకు కబురు వెళ్లినట్టు తెలుస్తోంది. అమిత్ షా మూడు రోజుల పర్యటన ముగిసిన అనంతరం ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలను విశ్లేషించి, సమీక్షించుకున్నాకే స్పందించాలని ఆ కబురు సారాంశంగా తెలుస్తోంది.
ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉండడంతో తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అమిత్ షా పర్యటన సాగుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే షా పర్యటనతో తమకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్‌డీఏలో టీఆర్ఎస్ భాగస్వామి కాకపోయినప్పటికీ బీజేపీతో ఆ పార్టీ సఖ్యతగానే ఉంటోంది. గజ్వేల్‌లో నిర్వహించిన ‘మిషన్ భగీరథ’ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ కూడా వచ్చివెళ్లారు.
అలాగే, ఇంకా పలు విషయాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సాయం అందుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని షా పర్యటనపై ఆచూతూచి స్పందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాలపైనే బీజేపీ దృష్టి పెట్టింది కాబట్టి, తమకొచ్చిన నష్టం ఏమీ లేదని గులాబీ శ్రేణులు పేర్కొన్నాయి. కాబట్టి నేతలు ఎవరూ తొందరపడి అనవసర విమర్శలు చేయవద్దని టీఆర్ఎస్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని నేతలకు సైతం చేరవేసి విమర్శలకు దూరంగా ఉండాలని సూచించింది.