: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన చైనా!
భారత్‌పై చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకునేలా ప్రవర్తించింది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లో సభ్యత్వం లేని దేశాలను ఇందులోనూ చేర్చుకోరాదని ప్రకటన చేసింది. ఎన్పీటీలో భారత్‌కు సభ్యత్వం లేని అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న చైనా.. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌కు ఎన్ఎస్జీలో సభ్యత్వం రాకుండా చేస్తోంది. ఎన్ఎస్జీలో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలూ భారత్‌కు అనుకూలంగా ఉంటే చైనా మాత్రమే అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది.
వచ్చే జూన్‌లో స్విస్ రాజధాని బెర్న్‌లో ఎన్ఎస్జీ సమావేశం జరగనుంది. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ఈ సమావేశం ద్వారా ప్రయత్నించాలని భారత్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా మరోసారి ఇటువంటి ప్రకటన చేసింది. తాజాగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్నింగ్ ఈ రోజు మాట్లాడుతూ... ఈ విషయంలో తమ దేశ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేశారు.