: సోషల్ మీడియా పరిచయం... ఆమెను ఎంత పని చేసింది!
అపరిచితులతో స్నేహాన్ని కోరుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలిపే ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడలూరు జిల్లాకు చెందిన కె.అమలేష్ (21) చెన్నై వలసరవాక్కంలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ నివాసం ఉంటున్నాడు. ఇతడికి చెన్నై వెస్ట్ సైదాపేట ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వేగంగా స్నేహితులయ్యారు. దీంతో ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. దీంతో కబుర్లతో కాలం గడిచిపోయింది. అమలేష్ ప్రేమిస్తున్నానని ఆమెకు చెప్పగానే, ఆమె కూడా అంగీకరించింది.
దీంతో ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు. తర్వాత తన అసలు రూపాన్ని చూపించాడు. ఈ సెల్పీలను మార్ఫింగ్ చేసిన అమలేష్ ఆ ఫోటోలు ఆమెకు పంపాడు. తాను కోరిన డబ్బు ఇవ్వకుంటే ఆ ఫోటోలు అంతర్జాలంలో పెడతానని బెదిరించి ఆమెతో ఐఫోన్, ల్యాప్ టాప్, ఇతర వస్తువులు కొనిపించుకున్నాడు. భారీగా డబ్బులు కూడా తీసుకున్నాడు. దీనిని అలుసుగా తీసుకుని అతడి స్నేహితులైన కడలూరు వాసి గోకుల్ (25), విల్లుపురానికి చెందిన చంద్రకుమార్ (22), వలసరవాక్కం ప్రాంతానికి చెందిన వసంత కుమార్ అలియాస్ మైకేల్ (24) లు కూడా ఆమెను బెదిరించి డబ్బులు గుంజారు. ఇలా ఆమె నుంచి 8 లక్షల రూపాయల వరకు వారు పిండుకున్నారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.