: ఎస్‌బీఐలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి చేదువార్త.. ఈ ఏడాది నియామకాలు తక్కువట!
దేశీయ అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న వారికి చేదు వార్త అందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంకు శాఖల్లో ఉద్యోగాల నియామకాలు తక్కువగా ఉంటాయని ఆ బ్యాంకు వెల్లడించింది. ఇటీవల ఎస్‌బీఐ పలు బ్యాంకులను విలీనం చేసుకుని టాప్ 50 బ్యాంకుల ఎలైట్ క్లబ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
అసోసియేట్ బ్యాంకుల నుంచి వచ్చిన ఉద్యోగులతో ఎస్‌బీఐలో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది. ప్రధానంగా తమ బ్యాంకు శాఖల్లో క్లరికల్ ఉద్యోగాల్లో నియమకాలు అసలు ఉండవని తెలిపింది. ఈ ఏడాది చివరలో ఆఫీసర్ స్థాయి నియామకాలు మాత్రమే ఉంటాయని చెప్పింది. మరోవైపు క్యూ4లో ఎస్‌బీఐ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఎస్‌బీఐలో ఎన్‌పీఏలు భారీగా తగ్గి, నికర వడ్డీ ఆదాయం భారీగా పెరిగింది. ఎస్‌బీఐ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెండు రెట్లయి రూ. 2,815 కోట్లుగా నమోదైంది.