: ధోనీని మరోసారి టార్గెట్ చేసిన పూణె జట్టు యజమాని


క్రికెట్ దిగ్గజం ధోనీపై రైజింగ్ పూణె సూపర్ జెయింట్ యజమాని సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఇప్పటికే సంజీవ్ సోదరుడు హర్ష్ గోయెంకా ధోనీని కించపరుస్తూ వ్యాఖ్యానించడం... దానికి బదులుగా ధోనీ భార్య సాక్షి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇవ్వడం, అభిమానులు విరుచుకుపడటం తెలిసిందే. నిన్న రాత్రి ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ మాట్లాడుతూ ధోనీని తగ్గించేలా కామెంట్ చేశాడు.

ధోనీ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదని, గెలవాలనే తపన ధోనీలో అధికమని, ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అతనే అని సంజీవ్ కితాబిచ్చాడు. అయితే, ధోనీకన్నా అద్భుతమైన మైండ్ సెట్ ఉన్న ఆటగాడు మరొకరు ఉన్నారని, అతనే స్టీవ్ స్మిత్ అని వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. గెలుపు తప్ప తనకు మరేదీ వద్దనుకునే స్వభావం స్మిత్ ది అని చెప్పాడు. 12 బంతుల్లో 30 పరుగులు సాధించు, లేకపోతే ఔట్ అయి వచ్చేసేయ్ అని తన టీమ్ మేట్స్ కు స్మిత్ సూచిస్తాడని తెలిపాడు. స్మిత్ కు ఫుడ్ పాయిజన్ కావడం వల్లే... తొలి మ్యాచుల్లో పూణె జట్టు సరిగా ఆడలేకపోయిందని చెప్పాడు. స్మిత్ వల్లే జట్టు ఫైనల్స్ కు చేరినట్టు... ఇందులో ధోనీ పాత్ర ఏమీ లేదన్నట్టుగా సంజీవ్ వ్యాఖ్యలు ఉండటంతో... ధోనీ అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు క్రీడా వర్గాల్లో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News