: నిషిత్ మరణంలో మరో కోణం.. ప్రమాదానికి వేగం ఒక్కటే కారణం కాదట!
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. తొలుత అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ అదొక్కటే కారణం కాదని, కారులోని యాంత్రిక లోపాలే అతడిని బలి తీసుకున్నట్టు తాజాగా వాహనాన్ని పరిశీలించిన నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రమాదం జరిగిన సమయంలో కారు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించలేదని గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవడంతోపాటు ఇంజిన్ ముందు సీటులోకి చొచ్చుకు వచ్చిందని చెబుతున్నారు. నిషిత్ మరణానికి ఇవే కారణమని అంటున్నారు.
నిషిత్ ప్రమాదానికి గురైన కారు బెంజ్ కంపెనీకి చెందిన ఈఏఎంజీ 63కి చెందినది. ఇది చాలా దృఢమైన వాహనంగా పేరు తెచ్చుకున్నప్పటికీ దానికి అంత సీన్ లేదని చెబుతున్నారు ఆటో టెక్నికల్ ఎనలిస్టులు. రూ.2.5 కోట్ల విలువ చేసే ఈ కారులో కోటి రూపాయలను కేవలం రక్షణ పరికరాల కోసమే ఖర్చు చేశారు. అయితే ప్రమాద సమయంలో కారు ఇంజిన్ క్యాబిన్లోకి చొచ్చుకు రావడం అందరినీ విస్మయపరుస్తోంది. అందులోని టెలిస్కోపీ స్టీరింగ్ రాడ్ సైతం పనిచేయకపోవడంతో అది నితిష్ చాతీకి బలంగా తాకింది. దీంతో స్టెర్నమ్ బోన్ విరిగి, ఊపిరితిత్తులు పగిలి నిషిత్ మరణించినట్టు పోస్టుమార్టంలో తేలింది.
పోస్టుమార్టం రిపోర్టుతో పోలీసులు కారులోని సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల్లో సమగ్ర సాంకేతిక నివేదిక కావాలంటూ బెంజ్ యాజమాన్యాన్ని కోరారు. వారిచ్చే సాంకేతిక నివేదిక ఆధారంగా నిషిత్ కుటుంబ సభ్యులు కేసు వేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.