: రాష్ట్ర సమస్యలపై కేంద్రానికి చంద్రబాబు లేఖ... రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం రాకపోతే సుప్రీంకి వెళ్లాలని నిర్ణయం
రాష్ట్ర విభజన చట్టం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పలువురు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... 2017 జూన్ 1తో ముగిసే స్థానికత అంశంపై గడువుని మరో రెండేళ్లు పొడిగించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. ఉన్నత విద్యామండలి విషయంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర హోంశాఖ నిర్ణయం రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు. 9, 10 షెడ్యూల్ లోని సంస్థలు, వర్సిటీల సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని, అవి పూర్తిచేయాలని కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.
హెడ్ క్వార్టర్స్‌పై కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు సుప్రీంకోర్టు స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పరకాల ప్రభాకర్ తెలిపారు. ఆ ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని ఢిల్లీ వెళ్లి కోరాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్రానికి అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని పరకాల ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర హక్కును సాధించుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం రాజీ పడబోదని తెలిపారు. ఏపీ వాసులు అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.