: అమెరికాలో హాట్ టాపిక్ ఇదే... న్యూక్లియర్ బాంబు దాడుల నుంచి రక్షణ ఎలా?
అమెరికాలో ఎవరిని కదిలించినా, ఎక్కడ చర్చ జరిగినా ఉత్తరకొరియా గురించిన టాపిక్కే ఉంటోంది. తాజాగా, ఉత్తరకొరియా న్యూక్లియర్ క్షిపణిని ప్రయోగించిన అనంతరం అమెరికన్లలో అణుబాంబుల భయం పెరిగిపోయిందని వెట్రన్ కంట్రీలో హెల్త్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న రాబర్ట్ లెవిన్ చెబుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు యుద్ధం వస్తే, ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు.
అణుబాంబు నుంచి రక్షణ కల్పించుకునే విషయంలో ఇతర రాష్ట్రాల ప్రజల కంటే కాలిఫోర్నియా వాసులు ముందంజలో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అణుబాంబు దాడి జరిగినప్పుడు బంకర్లలో దాక్కునే అవకాశం అందరికీ ఉండదని చెప్పిన ఆయన, అలాంటి వారు ఇంటి నుంచి బయటకు రాకూడదని, ప్రధానంగా బాత్ రూం నుంచి అస్సలు బయటకు రాకూడదని చెబుతున్నారు. తాముంటున్న ప్రాంతానికి సమీపంలో బాంబు పడితే ఆలస్యం చేయకుండా వెంటనే దుస్తులు మార్చుకోవాలని సూచించారు. సబ్బుతో లేదా షాంపూతో గాని స్నానం చేయాలని తెలిపారు. ఇది అణుబాంబు ప్రభావం నుంచి దూరం చేస్తుందని ఆయన చెబుతున్నారు.
అయితే దీనిపై బ్రెయిన్ ఫ్లోవర్ అనే వ్యాపారవేత్త పెదవి విరుస్తున్నారు. అణుబాంబుదాడి ఏ క్షణంలో జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ఆ సమయంలో ఇంట్లోనే ఉంటామన్న గ్యారెంటీ కూడా ఉండదని ఆయన చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో 20 అడుగుల లోతులో స్టీలు షెల్టర్లను నిర్మించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇలాంటి స్టీలు షెల్టర్లు అమెరికాలో విరివిగా దొరుకుతున్నాయని ఆయన సలహా ఇస్తున్నారు. ఆ షెల్టర్లలోనే స్నానం చేసేందుకు షవర్స్ కూడా అందుబాటులో ఉంటాయని ఆయన చెబుతున్నారు. స్టీలు షెల్టర్లే న్యూక్లియర్ దాడులనుంచి రక్షించగలవని ఆయన స్పష్టం చేస్తున్నారు.