: మేము ఒప్పుకోం.. చేసేది చేస్తాం: కుల్‌భూషణ్ జాదవ్ కేసులో తీర్పుపై స్పందించిన పాకిస్థాన్
గూఢచారిగా ఆరోపిస్తూ పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ రోజు భారత్‌కు అనుకూలంగా మధ్యంతర తీర్పునిచ్చిన అంశంపై పాకిస్థాన్ స్పందించింది. అంతర్జాతీయ న్యాయస్థాన తీర్పుని సైతం ధిక్కరించేలా పలు వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షను నిలిపి వేయాలని ఇచ్చిన తీర్పును అంగీకరించబోమని తేల్చిచెప్పింది. తమదేశ రక్షణలో భాగంగానే కుల్ భూషణ్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించామని పేర్కొంది.
ఈ కేసులో ఐసీజే దగ్గర భారత్ అసలు విషయాలు దాచిపెట్టిందని పాకిస్థాన్ దౌత్య కార్యాలయం అధికార ప్రతినిధి నఫీజ్ జకరియా ఆరోపిస్తూ... భారత్ అసలు రంగును తాము ప్రపంచం ముందట బయటపెడతామని అన్నారు. కుల్ భూషణ్ పాకిస్థాన్ లో గూఢచర్యానికి పాల్పడినట్లు అంగీకరించాడని, ఆయన తమదేశంలో విధ్వంసం సృష్టించడానికి వ్యూహరచన చేసినట్లు రుజువైందని వ్యాఖ్యానించారు. తమ దేశంలో భారత్ చేపడుతున్న గూఢచర్యంపై ఆధారాలను అంతర్జాతీయ న్యాయస్థానానికి సమర్పిస్తామని అన్నారు.