: కృష్ణా జలాల కోసం ఏపీకి రూ.362 కోట్లు చెల్లించేందుకు తమిళనాడు అంగీకారం
ఆంధ్రా-తమిళనాడు మధ్య జరిగిన నీటి ఒప్పందాల్లో భాగంగా చెన్నైకి సరఫరా అవుతున్న 12 టీఎంసీల కృష్ణా జలాలను ఇకపై అందుకోవడానికి రూ.362 కోట్లు చెల్లించేందుకు తమిళనాడు అంగీకరించింది. కండలేరు జలాశయం నుంచి సాయిగంగ కాలువ ద్వారా ఊతుకోట సమీపంలోని జీరో పాయింట్‌కు చేరకుని అక్కడి నుంచి కృష్ణా జలాలు పూళల్ జలాశయానికి చేరుకుంటాయి. అయితే సాయిగంగ కాలువ మరమ్మతులకు అందించాల్సిన రూ.362 కోట్లను అందిస్తేనే కృష్ణా జలాలను చెన్నైకి అందిస్తామని ఏపీ అధికారులు స్పష్టం చేశారు.
దీంతో స్పందించిన తమిళ ప్రభుత్వం వెంటనే ఈ బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. బకాయిలపై త్వరలోనే అసెంబ్లీలో చర్చించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కరవు పరిస్థితులు నెలకొనడంతో చెన్నైకి తాగునీరు అందించేందుకు కృష్ణా జలాలు అవసరమని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తమిళనాడు ప్రజాపనుల శాఖ అధికారి ఒకరు తెలిపారు.