: మధ్యాహ్న భోజన పథకాన్ని ‘ఇంటర్’ వరకు విస్తరించాలని కోరాం: కడియం శ్రీహరి
మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ మీడియట్ వరకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను ఈ రోజు ఆయన కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎనిమిదో తరగతి వరకే మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని అన్నారు. ఈ పథకాన్ని ఇంటర్ మీడియట్ వరకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్టు చెప్పారు.
యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లను పునరుద్ధరించాలని, వాటి ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మంత్రి దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. అలాగే, తెలంగాణలోని 110 మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లు కావాలని కోరినట్టు చెప్పారు. ఈ ఏడాదికి 84 కొత్త కేజీబీవీలు, 29 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసినట్టు కడియం శ్రీహరి పేర్కొన్నారు.