: జయలలిత ఎస్టేట్ లో హత్య కేసులో ఎమ్మెల్యే ఆరుకుట్టి హస్తంపై అనుమానాలు!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఊటీ సమీపంలో ఉన్న కొడనాడు ఎస్టేట్ వాచ్ మెన్ హత్య కేసులో అన్నాడీఎంకే కు చెందిన కవుండంపాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి హస్తం ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు. వాచ్ మెన్ హత్య కేసులో అనుమానాస్పదుడిగా ఉండి, ఆపై హత్య చేయబడ్డ జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ మృతి చెందే ముందు ఆరుకుట్టికి 300కు పైగా ఫోన్ కాల్స్ చేసినట్టు కాల్ హిస్టరీ చూపించడంతో పోలీసులు ఆయన్ను విచారించారు. కనకరాజ్, ఆరుకుట్టి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించడం గమనార్హం. పోలీసుల నుంచి సమన్లు అందుకున్న ఆరుకుట్టి విచారణకు హాజరు కాగా, ఆత్తూర్ లో పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో కనకరాజ్ అన్న ధనరాజ్ పాత్రపైనా పోలీసు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.