: సభను చెడగొట్టాలనే గొడవ చేశారు: కోమటిరెడ్డిపై మండిపడ్డ మంత్రి హరీశ్ రావు
నల్లగొండ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సభలో ఈ రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తించిన తీరు బాగోలేదని, ఆ సభను చెడగొట్టాలని కోమటిరెడ్డి గొడవ చేశారని అన్నారు. తమ ప్రభుత్వం ఓ వైపు రైతుల సంక్షేమ కోసం పాటుపడుతోంటే మరోవైపు ఇలా రాద్ధాంతం చేయడం భావ్యం కాదని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉండవనే తమ సర్కారు చేసే ప్రతి పనిని అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఏ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు నాటకాలు ఆపాలని, కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని అన్నారు.