: ఐటీ ఉద్యోగుల కోత ఉండబోదంటున్న కేంద్ర ప్రభుత్వం!
ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోత పడనుందనే వార్తలు ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. అలాంటిదేమీ లేదని, ఉద్యోగుల కోత ఉండబోదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఐటీ సంస్థల్లో భారీగా ఉద్యోగులను తొలగిస్తారని అంచనా వేయడం సరికాదని, రానున్న రోజుల్లో మరిన్ని నియామకాలు పెరుగుతాయని స్పష్టం చేసింది. ఉద్యోగుల కోత ఉండబోదని ఐటీ శాఖ కార్యదర్శి అరుణ సుందర రాజన్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
వార్షిక అంచనాల్లో భాగంగా కొన్ని కాంట్రాక్టర్లను పునరుద్ధరించలేదని, దీని వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు తొలగిస్తున్నారని ఊహించుకోవడం కరెక్టు కాదన్నారు. ఐటీ రంగంలో 8 నుంచి 9 శాతం వృద్ధి సాధ్యమవుతుందని అరుణ సుందరరాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, నైపుణ్యాలు, పనితీరు పరంగా కొందరిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు ఉన్నప్పటికీ, అవి ప్రతి ఏటా జరిగే కోతల్లో భాగమేనన్నారు.