: సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ముందు కలకలం... పురుగుల మందు తాగిన రైతు
హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం కలకలం చెలరేగింది. సీఎంను కలిసి తన గోడును వెళ్లబోసుకోవాలనుకున్న ఓ రైతు ప్రగతి భవన్‌కు వచ్చాడు. అయితే, తన పని జరగకపోవడంతో అక్కడే పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ రైతు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్ అని పోలీసులు గుర్తించారు. అప్పుల బాధ తాళలేకే ఆ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. వెంటనే స్పందించిన అక్కడి పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.