: ఫ్యాషన్ డిజైనర్ గొంతు కోసిన మాజీ డ్రైవర్
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఫ్యాషన్ డిజైనర్ కావేరి లాల్ ను అతని మాజీ డ్రైవర్ గొంతు కోశాడు. వివరాల్లోకి వెళ్తే, కావేరి తన తల్లి రేఖతో కలసి ఢిల్లీలోని శివాలిక్ అపార్ట్ మెంటులో ఉంటోంది. అనిల్ అనే వ్యక్తి వారి వద్ద డ్రైవర్ గా పని చేస్తూ, ఇటీవలే మానేశాడు. నిన్న మధ్యాహ్నం వారి ఇంటికి వచ్చిన అనిల్ ను ఎందుకు వచ్చావంటూ ఆమె తల్లి ప్రశ్నించింది. దీంతో, ఇదే అపార్ట్ మెంటులో మరో ఇంట్లో ఉద్యోగం చేస్తున్నానని... వారి కారు పార్క్ చేసేందుకు మీ కారు అడ్డంగా ఉందని అతను చెప్పాడు. దీంతో, ఆమె కారు తాళాన్ని అతనికి ఇవ్వబోయింది. కానీ, కావేరి వచ్చి తనే వెళ్లి కారును పార్క్ చేస్తానని చెప్పింది.
కిందకు వెళ్లిన ఆమె కారులో కూర్చోగానే అనిల్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోశాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు విద్యార్థులు గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోంది. అనిల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు.