: గూఢచారులకు దౌత్య సంప్రదాయాలేంటి?: జాదవ్ దోషేనని ఐసీజేలో పాక్ వాదన
గూఢచర్యానికి పాల్పడుతూ, తమ దేశంలో తీవ్రవాద చర్యలకు దిగిన కులభూషణ్ జాదవ్ కు ఎటువంటి దౌత్య సంప్రదాయాలు, వియన్నా నిబంధనలు వర్తించబోవని పాకిస్థాన్ న్యాయవాది ఖురేషీ ఐసీజేలో తన వాదనలు వినిపించారు. అంతకుముందు భారత్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు. జాదవ్ దోషేనని, ఆయన్ను తాము వెంటనే ఉరితీయబోమని, అపీలు చేసుకునేందుకు ఆరు నెలల సమయం ఇచ్చామని ఖురేషీ పేర్కొన్నారు.
జాదవ్ పాస్ పోర్టులో ముస్లిం పేరు ఎందుకు ఉందన్న విషయమై భారత్ ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. జాదవ్ తన నేరాన్ని అంగీకరిస్తున్నట్టు చెప్పిన వీడియోను ప్రదర్శిస్తామని చెప్పగా, కోర్టు దాన్ని అంగీకరించలేదు. వాదనలకు గంటన్నర సమయం ఇచ్చినప్పటికీ, గంటలోపే పాక్ తన వాదనను ముగించడం గమనార్హం. ఇక న్యాయస్థానానికి హాజరైన వేళ, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి దీపక్ మిత్తల్, పాక్ అధికారి ఫైసల్ తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించి, పాక్ తరఫున వాదనలు వినిపించేందుకు వచ్చిన ఖురేషి, ఇతర అధికారులతో మాత్రం చెయ్యి కలిపారు. ఫైసల్ ను చూసిన మిత్తల్ నమస్తే చెప్పి ముందుకు కదలడం గమనార్హం.